(భూమిక మార్చ్ 2007 సంచిక నుండి)
మూడో పప్రంచ యుద్ధం సూదితో మొదలైందా!నెత్తుటి బొట్టు నుంచున్న పళాన ఒణికిస్తోంది
కొమ్ములతో కోరలతో భయపెట్టే పాతకాలంవాడు కాదుఈ శతువ్రు జలుబుతో దగ్గుతూ క్షీణించిన కొద్దీ భయపెడతాడు
నిగహ్రమూ లేదు విశ్వాసమూ లేదుతొడుగు ఒక్కటే దాంపత్యాన్ని రక్షిస్తుంది
ఎంత పేమ్రతో వచ్చావో చెప్పకుఎన్ని తొడుగులు తెచ్చావో చెప్పు
తాళి కడుతున్నది వరుడనుకొని తలవంచుకుందివైరస్ అని తెలీదు
శరీరాలు వేరు పేమ్రలు వేరురెండిటినీ ఒక కిమ్రి విడదీస్తుంది
ఆమె కలియుగ చందమ్రతిచేసిన కాపురానికి కాటి సుంకం చెల్లించింది
పతివత్ర మంగళసూత్రం కట్టిన వాడి తర్వాతకత్తెర పట్టిన వాడికీ కనిపిస్తుంది
శీలం ఒక బలహీనమైన దీపంతలుపులు మూస్తే ఊపిరాడదు, తెరిస్తే గాలికాగదు
గాజురాయి కింద రెపరెపలాడే రిపోర్టుఇంటికి తీసుకెడుతుందో, ఊరినుంచి తరిమికొడుతుందో
దాహానికైనా దహనానికైనా మిగిలున్నది దేహమే కదాదేహాలు లేని గామ్రం చూపించండి
పాపకు అమ్మా నాన్నలింకా పేరు పెట్టలేదుహ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్గా డాక్టర్లు బారసాలె చేశారు
బల్లమీది వృద్దురాలి గుండె లబ్డబ్ అనడం లేదునెగెటివ్వా, పాజిటివ్వా అని కొట్టుకుంటోంది
ఆమెకు కడుపులో పుండు ఎప్పుడో తగ్గిందిభయమే అదే పనిగా సలపరిస్తోంది
నరానికి సూది గుచ్చితే రక్తమే వస్తుందినగరానికి సూది గుచ్చితే భయం వచ్చింది
ఆమె ఆస్పత్రి నుంచి అప్పుడే వచ్చిందిగుట్టు విప్పడానికి కౌరవ దుశ్వాసనులు పొంచివున్నారు
శృంగారం జీవ భౌతిక అవసరంశ్మశానాల్ని సృష్టించడమేమిటి?
కోపాన్నుంచి, అపనమ్మకాన్నుంచి, భయాన్నించి, బాధనుంచిదిగ్భ్రాంతినుంచి, దుఃఖానికి- దశలవారీగా దహనం చేసే దాని పేరేమిటి?
రక్తం పంచుకుని ఎందుకు పుట్టావంటూకన్నతల్లి కుమిలిపోతోంది
బాబు రిపోర్టు కోసం ఏణ్ణార్ధం ఆగాలిక్లోరోఫారంలో పడేసిన కప్పలాగా ఎదురుచూస్తోందామె
అతడు పోయాకే తెలిసిందినాటి పోయిన విషవృక్షపు నీడ
ఇక ఆ తల్లికి పురుటి నొప్పుల్లేవుకడుపునిండా కత్తికోతలే
Saturday, August 2, 2008
హెచ్.ఐ.వి హైకూలు
Posted by nirmalanandam at 5:24 PM 0 comments
Labels: కవితలు, భూమిక వ్యాసాలు
స్త్రీలకొక ప్రాంతీయ ఆస్తిత్వం వుందా?
(భూమిక ఫిబ్రవరి 2007 సంచిక నుండి)
నిన్న విశాఖ నుంచి మల్లేశ్వరి అనే లెక్చరర్ ఫోన్ చేసింది.
“కోస్తా ఆంధ్రా స్త్రీల గురించి తెలంగాణా వాదులు ఏదేదో అసహ్యంగా మాట్లాడుతున్నారుట కదా మీ దాకా రాలేదా?” అంది.
“… ఏమో రాలేదు. వచ్చినా ఆశ్చర్యపోను. ఎందుకంటే భారీ ఎత్తున ఒకసారి ఆశ్చర్యపోయి గట్టిగా నాలుగేళ్ళూ కాలేదు. పరమ నీచమైన కరపత్రం వేసి పంచిపెట్టారు. తెలంగాణా రచయితలు అని సంతకం చెయ్యడం వల్ల వివాదాస్పదం అయ్యింది. అది నిజమైన ఉద్యమ స్ఫూర్తితో పనిచేసే వాళ్ళని ఇబ్బంది పెట్టేలా వుంది. కాబట్టి దాన్ని వాళ్ళూ తక్షణం తమది కాదన్నారు. నిజమైన కార్యకర్తలెవరూ ఇలా వుండరన్నారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు కాళ్ళూ చేతులు విరగ్గొట్టమన్నారు. అయితే నెల్లాళ్ళ లోపే మళ్ళీ ఈ చేతులు కలిశాయి. వేదికలు పంచుకున్నారు. వెనక చాటుగా మద్దత్తు ఇచ్చారు. అంతా మారిపోయినట్టూ, మనపట్ల ఎంతో సానుభూతి ఉన్నట్టూ మనం కూడా నమ్మేశాం. పోనీ కాస్సేపు మొహాల్ని అలా వెలిగించుకున్నాం. వాళ్ళకున్న సోదరత్వం, ఏకీభావం మనకెందుకు లేవా అని అసూయపడ్డాం.
ఇప్పుడు మళ్ళీ ఈ తెల్లబోవటం, వేదికలెక్కి ఒంటరి గొంతులతో అరుచుకోవటం, ఆ తర్వాత మర్చిపోయినట్లు మొహాలు పెట్టడం మన వల్ల కాదన్నాను.
ప్రాంతీయవాదం గురించి పూర్తి స్థాయి స్పష్టత, అవగాహన నాకున్నాయి. కానీ నా అస్తిత్వం గురించి నాకే చాలా గందరగోళం వుంది. దాన్ని మీతో పంచుకోవటానికి మల్లేశ్వరి ఫోను దోహదం చేసింది.
చెప్పండి స్త్రీలకొక ప్రాంతీయ అస్తిత్వం వుందా? కోస్తా ఆంధ్రాలో పుట్టి, తెలంగాణాలో మెట్టి, రాయలసీమలో గిడుతున్న ఆడవాళ్ళూ ఏ గడ్డ నాదనుకుంటారు? ఏ ప్రాంతానికి చెందిన రాజకీయం మాట్లాడగలుగుతారు. పుట్టిన ఇల్లే నాది అనుకునే అర్హత లేనివాళ్ళు కదా. ఒక కులానికీ మతానికీ మాత్రం చెందుతున్నారా? ఇంటి పేరూ, గోత్రమూ మనవేనా? దేశాల మధ్య జరుగుతున్న రాజకీయాలూ, యుద్దాలూ, శాంతి చర్చల్లో, అంతర్జాతీయ విపణిలో మన పాత్ర ఏమిటి?
అంతే కాదు. ప్రజాస్వామ్య బద్ధంగా మన వోటు మనమే వేస్తున్నామా? హక్కులు మనమే అనుభవిస్తున్నామా?
ఏ కిరాయితనమూ మనల్ని బంధించడం లేదంటారా? నా వరకూ నేనుఆస్తిహక్కు మాట ఎత్తితే తమ్ముడితో రక్త సంబంధం దెబ్బ తింటుంది.సమాన హక్కు గురించి మాట్లాడితే భర్తగారి అనురాగం దెబ్బ తింటుంది.మాతృత్వంలో లోపం కనబడితే పిల్లల ప్రేమ దెబ్బతింటుంది.ప్రాంతాన్ని గురించి అస్పష్టత కనబరిస్తే ఉద్యమం గురించి నాకున్న నిబద్ధత దెబ్బతింటుంది.
ఎటువంటి ఆహ్వానమూ లేనిచోట అందరూ మనవాళ్ళే అనుకుంటూ, ఊరేగింపుల్లో పాల్గొంటూ ఎప్పటికప్పుడు వలసలు భుజాన వేసుకుని భరోసా లేని సొంత పునాది లేని మనము ఏ అస్తిత్వ ఉద్యమాలతో మాట్లాడే హక్కును సంపాయించుకుంటాము? ఎక్కడ పుట్టడం వల్ల, పెరగడం వల్ల, పెళ్ళి చేసుకోవడం వల్ల, బతకడం వల్ల, అమ్ముడుపోవడం వల్ల, చనిపోవడం వల్ల శీలవంతులం అవగలుగుతాం. కరపత్ర వీరులకైనా స్పష్టత వుందా? పోనివ్వండి. లేకుండా పోయిన అనేక వాటితో బాటు మనకిప్పుడు శాపగ్రస్తలాంటి శీలం కూడా ఒకటనుకుంటాం… సరేనా? దయచేసి ఇంకొంచెం మంచి విషయాల మీద సమయం పెడదాం. మీ ఉద్యమాలకు టీలు కాచడమే కాదు. టీకా తాత్పర్యాలూ సాధించడంలో చెయ్యి కలుపుతున్నాం.
ఒక ప్రాంతం, కులం, మతం, దేశం వెనకబడి వుండటానికి ఎన్ని కారణాలు వుంటాయో తెలిసిన ఉద్యమకారులకి ఒక జండర్‌ని అర్థం చేసుకోవటం ఇంత కష్టమా? నోరు జారడం అంత తేలికా?
Posted by nirmalanandam at 5:22 PM 0 comments
Labels: భూమిక వ్యాసాలు
రాచబాట మీది దొంగాటని దెబ్బ కొట్టాలి
(భూమిక జనవరి 2007 సంచిక నుండి)
ఆ మధ్య పూనాలో జరిగిన అంతర్జాతీయ రచయితల సదస్సులో తెలుగునుంచి రచయిత్రుల్లేరు. వేదికమీద చేతులు కలుపుకుని జేకొట్టిన తెలంగాణా ఉద్యమ రథసారధుల్లో ఆడవాళ్ళు లేరు. బెంగుళూరులో జరిగిన జాతీయ సమ్మేళనంలో తెలుగు కవయిత్రుల్లేరు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ విలేఖరుల గోష్టిలో తెలుగునుంచి కె. సత్యవతి తప్ప మరే మహిళా జర్నలిస్టుల్లేరు.
-ఇది చాలా చిన్న చిట్టా. తల్చుకుంటే ఇంతకంటే పెద్ద చాంతాడు ఇప్పటికిప్పుడు మీకూ గుర్తొస్తుంది.
ఒక మనిషి లేక సంస్థ ఒకసారి, పదిసార్లు వందసార్లు చేసిన తప్పును కూడా పొరబాటు అని సమర్థించుకోవచ్చు. కానీ పదిమందీ పదిసంస్థల ద్వారా పది వందల సార్లు చేసిన తప్పు ఒక సంస్కృతి అవుతుంది. కుట్రపూరిత రాజకీయం అవుతుంది. అంధత్వమూ, బధిరత్వమూ ఒక నాగరికత అయిపోతే దాన్ని గురించి మాట్లాడినపుడు భరించడానికి ప్రధాన స్రవంతి దూరం జరిగితే మరి వేదిక ఎక్కడ కట్టుకోవాలి?
ప్రపంచాన్ని మొదటినుంచీ ప్రత్యామ్నాయ పత్రికలూ, వేదికలూ, సాహిత్యమూ, మనుషులూ, దారులూ నడిపిస్తుంటే ప్రజాస్వామ్య బద్ధంగా రాజబాటమీద జరుగుతున్న దొంగాటని ఎవరు దెబ్బ కొట్టాలి?
తెలుగు సాహిత్యంలో వున్నన్ని సాహిత్యేతర శక్తులు ఇతర భాషల్లో లేవు. సాహిత్య వేదికలు నిర్వహించే వారి భూమిక ఏమిటి? జరగబోయే కార్యక్రమాలకు ఆహ్వానించడానికి ఎవర్ని సంప్రదిస్తారు? ఆయా పేర్లను సూచిస్తున్న వారి అర్హతలేమిటి? ఏ నిబద్ధతతో అతడు లేక ఆమె నిర్ణయాలు చేస్తారు? స్థానిక పత్రికల్లో కూడా కనిపించని రచయితలు/ కవులు అంతర్జాతీయ బహుమతులు ఎలా అందుకుంటున్నారు? ఏ ప్రయోజనాలు ఎవర్ని శాశిస్తున్నాయి? ఏ బలహీనతలు ఎందర్ని మౌనంగా వుంచుతున్నాయి? పరిశోధన చెయ్యదల్చుకుంటే ఇంతకంటే రసవత్తరమైన ఘట్టం ఇంకోటి లేదు.
ఈ నేపథ్యంలో అందరితో బాటు కొంత అందరి కంటే ఎక్కువగా మరికొంత పక్కకి నెట్టబడుతున్నది స్త్రీలే. రచయిత్రులుగా, పాత్రికేయులుగా, కళాకారులుగా మనం కలుసుకున్న ప్రతిసారీ ఎన్నో సమస్యల మీద మాట్లాడుకుంటున్నాం. ఎన్నో ప్రతిపాదనలు చేసుకుంటున్నాం. కొత్త ఆలోచనలు కలబోసుకుంటున్నాం. మళ్ళీ కొన్ని నెల్లపాటు కమ్యూనికేషన్ గ్యాప్. కలిసిన చేతులు విడిపోతాయి. ఎవరి ప్రపంచంలో వారు కూరుకుపోతున్నాం. మన శక్తిసామర్థ్యాలు, ప్రతిభ అన్నింటిలోనూ ఒంటరివాళ్ళమైపోతున్నాం. వాటికి సామూహిక స్పందన లేకుండా పోతోంది.
ఓ పక్క ప్రపంచీకరణ మనల్ని ఎడాపెడా వాయిస్తోంది. సమాచారాన్ని సూపర్ బజార్ చేసి చూపెడుతోంది. తెలుగునుంచి ఇతర భాషల్లోకి తక్షణమే తర్జుమా కావాల్సిన యుద్ధ ప్రాతిపదికమీద, అంతర్జాతీయ అవసరం మీద మన రచనలు వున్నాయి. జరగాల్సిన ప్రయత్నం జరక్కపోగా ఏ మాత్రమూ ప్రాతినిధ్యానికి అర్హతలేని నాసిరకం రచనలు తెలుగు వారసత్వం పేరిట ఇతర భాషల్లోకి వెళుతున్నాయి. ఇవి ఇటు తెలుగువారినీ అటు ప్రపంచ సాహిత్య అంచనాల్నీ మోసం చేస్తున్నాయి.
ఇవాళ మనం నిలబడ్డ ఈ భూమిక ఇన్ని సమస్యల్లో ఇరుక్కుపోయింది. నిజమే. తల్చుకుంటే అనాసక్తిగానే వుంటుంది. ఏ ప్రోత్సాహమూ లేని వాతావరణంలో రాయడం, అచ్చెయ్యడం, చేసిన పాపం మాదిరి నెత్తిని పెట్టుకుని అమ్ముకోలేకపోవడం- ఇదంతా దుఃఖంగానే వుంటుంది. ఈ నేపథ్యంలో రచన ఒక బాధ్యతగా కాక బాధగానూ, స్పందన ఒక సృజనగా కాక సలపరంగానో కూడా వుండొచ్చు.అయినప్పటికీ మనం కలవాలి. మాట్లాడుకోవాలి. మన కోసం మనమే అయినా రాసుకోవాలి. ఏ అణచివేత వర్గాన్ని చూసినా మంచి రచన ఇలాగే పుడుతుంది. కొత్త సంకలనం వెయ్యడానికి మీ సూచనలు చెప్పండి. గతంలో చేసుకున్న నిర్ణయాలు గుర్తు చేసుకుందాం. అనువాదాల్ని వేసే ప్రయత్నం చేద్దాం. అన్నిటినీ మించి మనం ఒంటరివాళ్ళం కాదు అనే విషయాన్ని పదే పదే తల్చుకుందాం.
Posted by nirmalanandam at 5:20 PM 0 comments
Labels: భూమిక వ్యాసాలు
నా సంతోషం సొరకాయ కూర వండడంలో లేదు సూర్యోదయంలో ఉంది
వంట చెయ్యడమంటే నాకు పరమ చిరాకు.
దాన్నొక వృత్తిగా మలచి విశ్వవిద్యాలయాలు నడిపిస్తూ ఏటేటా వేలాది మంది సంస్థాపరమైన వంట నిపుణుల్ని దిగుమతి చేస్తున్నా సరే అవి నాకేమాత్రం ఆసక్తిని కలిగించలేకపోయాయి. మూడు తరాల ఆడపిల్లలు కలలు కన్న ఎయిర్ హోస్టెస్ (గగన సఖి) ఉద్యోగం కూడా వంటకి అనుబంధమైన వడ్డన వుండటం వల్లనే అనాకర్షణీయంగా కనిపిస్తుంది.
నా అభిప్రాయాలు నావి అవి ఎవర్నైనా బాధిస్తే క్షమించాలి. ఆ మాటకొస్తే నన్ను నేనిలా క్షమించుకుంటూ బాధించుకుంటూ గత పాతికేళ్ళుగా వొండి వారుస్తూనే వున్నాను. బహుశా ఒక మహా నగరానికి సరిపడినంత కూరలూ పచ్చళ్ళూ, సాంబార్లూ ఈ సుష్కమైన చేతుల్తో ఉడికించేసి వుంటాను.వంటని ఇంతగా ద్వేషించే మీరు అందులో ఉన్న “శ్రమ జీవన సౌందర్యా”న్ని ఎలా గుర్తిస్తారనో, ఎవరు వండకపోతే తిండి ఎలా తింటారనో మీరు నన్ను అడగచ్చు. అన్ని పనుల్లాగే వంటకూడా అభిరుచికీ అవసరానికీ పరిమితమై వుండక ఒక జెండర్ జీవితాన్నే ఎందుకు కాల్చుకు తింటుందనేది నా ప్రశ్న.”వంట బానే చేస్తావుగా కాస్త మొహం ప్రశాంతంగా వుంచుకుంటే ఏం పోయింది?” నీకేం కావాలో చెప్పు మిక్సీనా, కొత్త స్టవ్వా? అంటాడు మా ఆయిన.
అడిగితే వంటావిడ్ని కూడా కొని పెడతాడు. అప్పుడు నేను వంటింటికి నటీమణి స్థాయినుంచి దర్శక స్థాయికి మారుతానే తప్ప ఆ గోడలు దాటి ఇవతలికి మాత్రం రాలేను. నేను అడుగుతున్నవి ప్రత్యామ్నాయ మార్గాలు కాదు. విధానంలో వున్న లోపాల్ని గురించి.
బతకడం కోసం తినాలి కాబట్టి తిండికి వంట తప్ప, ఆ వండేందుకు నా చేతులు తప్ప ఇంకో దారి లేదు కాబట్టి నేను పుట్టకముందునుంచి వంటింటికి లొంగిపోయాను.
ఈమద్య పన్నాసుభ్రమణ్య భట్టు అనే పెద్దమనిషి, “నేనిప్పుడు ఇంటికెళ్ళీ, మడి కట్టుకుని మా అమ్మకి వొండిపెడతాను తెలుసా? ఏమిటి మీ ఫెమినిస్టు కష్టాలు?” అన్నాడు.
ఇందులో అనేక కోణాలు ఉన్నాయి.
వంట ఏమంత కష్టం తల్చుకుంటే నాలాంటి మగధీరుడు కూడా వొండి పడేస్తాడు. అనేది ఒకటి. అయితే ఇదే వంట వాళ్ళమ్మ మంచంలో పడ్డాకా గానీ రుచి చూసే భాగ్యానికి నోచుకోలేదు. ఈ భాగ్యానికి ముందు ఆవిడ ఎన్ని టన్నుల మడి బట్టల్ని ఆరేసిందో, ఎన్ని ఎకరాల్ని ఉడికించిందో ఈ కొడుక్కి తెలీదు.
వంటింటిని గురించి సగటు మగవాడి కబుర్లు భలే ఆసక్తిగా వుంటాయి. “ప్చ్… ఏం ఉద్యోగాలో ఏం పాడో ఆడాళ్ళ ప్రాణానికి సుఖం లేకుండా పోతోంది” అంటాడు మా మామగారు. సుఖంగా వుండటమంటే సోరకాయని ఆవపోసి, పులుసుపోసి, పాలుపోసి, పెరుగుపోసి, సెనగలు పోసి, గన్నేరు పప్పులు పోసి వండటమనేది ఆయన అభిప్రాయం కావచ్చు. మరెందుకో గాని నా సుఖం సంతోషం సోరకాయలో లేవు. అవి సూర్యోదయంలో వున్నాయి. వంట చింతలేని ఆకాశంలో పొడిచిన సూర్యోదయం.
అందుకోసం నేను రాత్రే కూరలు తరుక్కుని కూచోవాలి. లేదా సూర్యోదయానికి ముందు ఇడ్లీ కుక్కర్ స్టవ్వు మీద విసిరి కొట్టి మేడమీదికి పారిపోవాలి. కుక్కరు ఈలేసినా వంటిల్లు కన్ను కొట్టినా వెనక్కి చూడకూడదు.
ఇడ్లీల కోసమే నిద్ర లేచిన వాళ్ళకి ఆ ఇడ్లీలంటే ఆసక్తి లేని, సూర్యోదయం మీద ప్రేమ వున్న వాళ్ళు ఆ ప్రేమంతా త్యాగం చేసి పిండి ముద్దలై ఉడకాలి. భలే బావుంది కదూ.
మగాడి హృదయానికి పొట్టలోంచి దారి వుంటుందిట. అంత చెత్త దారిలోంచి ప్రయాణించే అవసరం ఎవరికి రాకుండుగాక. మరి ఆడాళ్ళ హృదయానికి దారి ఎవరైనా కనిపెట్టారా? ఎదురుగుండా టి.వి లో “పెళ్ళాం ఊరెళితే…” అనే సినిమా వస్తోంది. ఒకే ఒక ఆడదాని కోసం ఎంత వెర్రి వెంగళాయిలైపోతున్నారో చూస్తున్నాను. మరి మొగుడు ఊరెడితే ఆ సమయం ఎంత ఫలవంతంగా, ఆనందంగా వుంటుందో ఎన్నాళ్ళనుంచో వాయిదా పడ్డ పనులు ఎంత బాగా చేసుకోవచ్చో నేనది అనుభవిస్తున్నాను. ఇవాళ అన్నం వొండుకోలేదు. కాఫీ కలుపు కోలేదు. నచ్చిన పాటలు విన్నాను. నచ్చిన రాతలు రాశాను. నచ్చిన మిత్రులతో కబుర్లు చెబుతున్నాను. ఆకలి వేస్తే బైటికి పోయి తింటాను. అది ఇంకొకరికి ఆదాయం అవుతుంది. ఇది స్వేచ్ఛ రుచి అభిరుచి పానీయం.
Posted by nirmalanandam at 5:08 PM 0 comments
Labels: వ్యాసాలు