Saturday, August 2, 2008

వానా బురదా !!

స్కూటరు చక్రాలు రెండూ బాల్య స్నేహితుల్లా
వాన నీళ్ళు చిందుకుంటూ ముందుకు పరుగెడుతున్నాయి
అడిగి మరీ లిఫ్టు ఇస్తున్న వాడు
నమ్మదగిన వాడో కాదో తెలీదు
తెలియని రోడ్ల మీద తెలిసినట్టుండటం కోసం
చూపుల్ని జోడుగుళ్ళ తుపాకీలా ఎక్కుపెట్టి వుంచాను
మెదడు బుట్టలో కదులుతున్న పిరికి పాములు
మేకపోతు గాంభీర్యాన్ని చెదరగొడుతున్నాయి
ఇలాంట ప్పుడునా అభిప్రాయాలకొంటే
మా అమ్మమ్మ భయాలే బలంగా చేతికందుతాయి
రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళేం అనుకోకుండా
దుకాణంలో కూచున్న వాళ్ళేం అనుకోకుండా
చెట్టూ మీద పిట్టలూ,గుట్టమీద పసువులూ ఏమీ అనుకోకుండా
నాలో నేనే ఏమీ అనుకోకుండా
అతనిలో అతనూ ఏమీ అనుకోకుండా
ఇద్దరి మధ్యా చైనా గోడ లాంటిచేతి సంచీ
సరిహద్దు క ట్టాను
అస్పృస్యత ఇచ్చినంత భద్రత ఇంకేదీ ఇవ్వదు కదా
ఆడకీ మగకీ మధ్య ఆకర్షణ ఎంత వుందో
అగాధమూ అంతే వుంది
ఆకర్షణకి అగ్గాధాన్ని పూడ్చే శక్తి లేదు
కాబట్టే అగంతక ఆడదానిలా నేనూ
అపరిచిత మగాడిలా అతనూ
బండెక్కిన రెండు గంటల తర్వాత కూడా
మాట పెగుల్చుకోలేకుండా వున్నాం
వూరూ పేరూ తెలియనవసరం లెని
ఇంత నిర్భంధ,నిరంకుశ ప్రయాణం
మామూలు సందర్భాల్లో నాకూ నచ్చదు
ప్రస్తుతం చీకటి మూలంగా నా వ్యక్తిత్వం చిన్నబోయింది
తడిసిన బట్టల మూలంగా నా స్వభావం తారుమారయింది
పరిసరాల భీభత్సంలొ నా సిద్ధాంతం కొట్టుకు పోయింది
ఎక్కడెక్కడి హత్యలూ, ఆత్యాచారాలు,అమ్మకాలు
గోలగోలగా వినిపిస్తున్నాయి
ఏ కారణం గా అతను వెనక్కి తిరిగి ఇటు చూసినా
నేను తగిలించుకున్న అద్దాలకు ఒకే అర్ధం స్ఫురిస్తుంది
అవసరం నాదే అయినా అడిగి మరీ లిఫ్టు ఇస్తున్నవాడ్ని
గమ్యం చేర్చే లోపు నమ్మలేను
సందు మలుపులకీ,స్పీడు బ్రేకర్లకీ
బంగాళా ఖాతంలొ వాయిగుండానికీ
అతని కుట్ర లేదని ఒప్పుకోను
అనుమానం అనుభవాల వెన్నంటి దూసుకు పోతోంది
లోక జ్నానం చేదునే అతిగా మన్నిక చేసింది
తెగిన విద్యుత్తీగల్నీ ,మూతలేని పాతాళ గంగల్నీ ,ఉరుముల్నీ మెరుపుల్నీ
ఒడుపుగా దాటుకుంటూ బండి మా ఇంటి ముందు ఆగింది
కొత్త బ్యాటరీ వేసినట్టు నా మొహం తేట పడింది
దారి పొడుగునా ద్వేషిస్తూ
తడవకొక తులం చొప్పున అతని ఆత్మ గౌరవాన్ని బలి తీసుకున్న పాపానికి
కాసిని టీ నీళ్ళు గాని పోద్దామా -అనిపించింది
తీరా ఇంట్లో వాళ్ళేం అనుకుంటారో
ఎదురింటి వాళ్ళేం అనుకుంటారొ
పక్కింటి వాళ్ళేం అనుకుంటారో
నాలో నేనే ఏమయినా అనుకుంటానో
అతనిలో అతనే ఏమయినో అనుకుంటాడో
తెలీదు కనక ఆ పని మానేశాను
తెలుగు సినిమా కుమ్మరించిన దుష్టపాత్ర లా
వున్నాడనిపింఛిన ఆ మనిషి
నా కుటిలమైన అంచనాలోనే సగం మరణించి
ఆపిన చోటనే బండి తిప్పుకుని చివాల్న వెళ్ళిపోతుంటే
ఛేదించాల్సిన దుర్మార్గం నాలో వుందో
చౌరాస్తాలో వుందొ అర్ధంకాక తల్లడిల్లిపోయాను

0 comments:

టిక్..టిక్..టిక్..

ఈ వారం తెలుగు పదం

తెలుగు వెలుగులు