Saturday, August 2, 2008

స్త్రీలకొక ప్రాంతీయ ఆస్తిత్వం వుందా?

(భూమిక ఫిబ్రవరి 2007 సంచిక నుండి)
నిన్న విశాఖ నుంచి మల్లేశ్వరి అనే లెక్చరర్ ఫోన్ చేసింది.
“కోస్తా ఆంధ్రా స్త్రీల గురించి తెలంగాణా వాదులు ఏదేదో అసహ్యంగా మాట్లాడుతున్నారుట కదా మీ దాకా రాలేదా?” అంది.
“… ఏమో రాలేదు. వచ్చినా ఆశ్చర్యపోను. ఎందుకంటే భారీ ఎత్తున ఒకసారి ఆశ్చర్యపోయి గట్టిగా నాలుగేళ్ళూ కాలేదు. పరమ నీచమైన కరపత్రం వేసి పంచిపెట్టారు. తెలంగాణా రచయితలు అని సంతకం చెయ్యడం వల్ల వివాదాస్పదం అయ్యింది. అది నిజమైన ఉద్యమ స్ఫూర్తితో పనిచేసే వాళ్ళని ఇబ్బంది పెట్టేలా వుంది. కాబట్టి దాన్ని వాళ్ళూ తక్షణం తమది కాదన్నారు. నిజమైన కార్యకర్తలెవరూ ఇలా వుండరన్నారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు కాళ్ళూ చేతులు విరగ్గొట్టమన్నారు. అయితే నెల్లాళ్ళ లోపే మళ్ళీ ఈ చేతులు కలిశాయి. వేదికలు పంచుకున్నారు. వెనక చాటుగా మద్దత్తు ఇచ్చారు. అంతా మారిపోయినట్టూ, మనపట్ల ఎంతో సానుభూతి ఉన్నట్టూ మనం కూడా నమ్మేశాం. పోనీ కాస్సేపు మొహాల్ని అలా వెలిగించుకున్నాం. వాళ్ళకున్న సోదరత్వం, ఏకీభావం మనకెందుకు లేవా అని అసూయపడ్డాం.
ఇప్పుడు మళ్ళీ ఈ తెల్లబోవటం, వేదికలెక్కి ఒంటరి గొంతులతో అరుచుకోవటం, ఆ తర్వాత మర్చిపోయినట్లు మొహాలు పెట్టడం మన వల్ల కాదన్నాను.
ప్రాంతీయవాదం గురించి పూర్తి స్థాయి స్పష్టత, అవగాహన నాకున్నాయి. కానీ నా అస్తిత్వం గురించి నాకే చాలా గందరగోళం వుంది. దాన్ని మీతో పంచుకోవటానికి మల్లేశ్వరి ఫోను దోహదం చేసింది.
చెప్పండి స్త్రీలకొక ప్రాంతీయ అస్తిత్వం వుందా? కోస్తా ఆంధ్రాలో పుట్టి, తెలంగాణాలో మెట్టి, రాయలసీమలో గిడుతున్న ఆడవాళ్ళూ ఏ గడ్డ నాదనుకుంటారు? ఏ ప్రాంతానికి చెందిన రాజకీయం మాట్లాడగలుగుతారు. పుట్టిన ఇల్లే నాది అనుకునే అర్హత లేనివాళ్ళు కదా. ఒక కులానికీ మతానికీ మాత్రం చెందుతున్నారా? ఇంటి పేరూ, గోత్రమూ మనవేనా? దేశాల మధ్య జరుగుతున్న రాజకీయాలూ, యుద్దాలూ, శాంతి చర్చల్లో, అంతర్జాతీయ విపణిలో మన పాత్ర ఏమిటి?
అంతే కాదు. ప్రజాస్వామ్య బద్ధంగా మన వోటు మనమే వేస్తున్నామా? హక్కులు మనమే అనుభవిస్తున్నామా?
ఏ కిరాయితనమూ మనల్ని బంధించడం లేదంటారా? నా వరకూ నేనుఆస్తిహక్కు మాట ఎత్తితే తమ్ముడితో రక్త సంబంధం దెబ్బ తింటుంది.సమాన హక్కు గురించి మాట్లాడితే భర్తగారి అనురాగం దెబ్బ తింటుంది.మాతృత్వంలో లోపం కనబడితే పిల్లల ప్రేమ దెబ్బతింటుంది.ప్రాంతాన్ని గురించి అస్పష్టత కనబరిస్తే ఉద్యమం గురించి నాకున్న నిబద్ధత దెబ్బతింటుంది.
ఎటువంటి ఆహ్వానమూ లేనిచోట అందరూ మనవాళ్ళే అనుకుంటూ, ఊరేగింపుల్లో పాల్గొంటూ ఎప్పటికప్పుడు వలసలు భుజాన వేసుకుని భరోసా లేని సొంత పునాది లేని మనము ఏ అస్తిత్వ ఉద్యమాలతో మాట్లాడే హక్కును సంపాయించుకుంటాము? ఎక్కడ పుట్టడం వల్ల, పెరగడం వల్ల, పెళ్ళి చేసుకోవడం వల్ల, బతకడం వల్ల, అమ్ముడుపోవడం వల్ల, చనిపోవడం వల్ల శీలవంతులం అవగలుగుతాం. కరపత్ర వీరులకైనా స్పష్టత వుందా? పోనివ్వండి. లేకుండా పోయిన అనేక వాటితో బాటు మనకిప్పుడు శాపగ్రస్తలాంటి శీలం కూడా ఒకటనుకుంటాం… సరేనా? దయచేసి ఇంకొంచెం మంచి విషయాల మీద సమయం పెడదాం. మీ ఉద్యమాలకు టీలు కాచడమే కాదు. టీకా తాత్పర్యాలూ సాధించడంలో చెయ్యి కలుపుతున్నాం.
ఒక ప్రాంతం, కులం, మతం, దేశం వెనకబడి వుండటానికి ఎన్ని కారణాలు వుంటాయో తెలిసిన ఉద్యమకారులకి ఒక జండర్‌ని అర్థం చేసుకోవటం ఇంత కష్టమా? నోరు జారడం అంత తేలికా?

0 comments:

టిక్..టిక్..టిక్..

ఈ వారం తెలుగు పదం

తెలుగు వెలుగులు