Thursday, October 9, 2008

ప్రేమ మాధ్యమం

సాయంత్రం ఆరు గంటలు;
బ్రెయిలీ క్లాసుకి ఆటవిడుపు గంట మోగింది
చైతన్య పురి చౌరాస్తా నుంచి ముగ్గురబ్బాయిలు
దూసుకొచ్చే వాహనాల మధ్య నుంచి
ఒకరి చేతులొకరు పట్టుకుని మెల్లిగా రోడ్డు దాటారు
ఇ - సేవ కివతల మలుపు మీద నుంచున్న
ముగ్గురమ్మాయిలకీ ప్రాణం వచ్చింది
గల్లీ రౌడీ చూపుల్ని విదిలించుకుని
ఒక్కసారిగా ముందుకొచ్చారు
"షాజహానా ఎక్కడున్నావు..?"
"స్వప్నా నే వచ్చాను చూశావా.."
"ఎస్తర్ ఇవాళ వచ్చిందాండీ..?"
అబ్బాయిలు ఎవరి ప్రపంచాన్ని వాళ్ళు పేరు పెట్టి పిలిచారు
వారం రోజుల పాటు ఉగ్గబట్టుకున్న ఏకాంత దుఃఖం
నల్లద్దాల వెనక ప్రవహిస్తోంది

అమ్మాయిలు మాట్లాడలేరు
నిశ్శబ్దం వారి పెదవుల మీద మోపిన శిల
షాజహానా ఒకబ్బాయి పక్కకొచ్చి
అర చేతిలో మధురగీతం రాస్తుంది
స్వప్న అలిగినట్టు నుంచుని
అతని మాటల్ని అల్లుకుని మెడలో వేసుకుంటుంది
ఎస్తర్ నవుతూ ఎదురొచ్చి
అబ్బాయి చెంపమీద ఎవరూ చూడకుండా ఒక ముద్దు పెడుతుంది
ఇక్కడ నిజంగానే ప్రే మ గుడ్డిది
ప్రేమ మూగది
శ్రవణాన్ని దృశ్యంగా మార్చుకుని
సంభాషణ చేస్తున్న అబ్బాయిలకు
దృశ్యాన్ని శబ్దంగా కూర్చుకుని
సమాధానం చెబుతారు అమ్మాయిలు
మూడు జంటల శ్రవణ, శబ్ద, నేత్రావధానం
అరవై నిమిషాల సేపు
చైతన్య పురి పరిసరాల్ని ప్రేమ పురి చేస్తుంది
హాస్ట్లలుగంట పరమ నిర్దయగా మోగుతుంది
విడిపోవడం ఇష్టంలేని చేతులు మరింతగా బిగుసుకుంటాయి
హటాత్తుగా భూమి చీలి తలో దిక్కునా పడినట్టు
నిస్సహాయంగా అమ్మాయిలు తమ గదికి వెడతారు
అబ్బాయిలు ఒకర్నొకరు పట్టుకుని మళ్ళీ ప్రమాదాల రోడ్డెక్కుతారు
వారానికొక్క ఇంద్ర ధనస్సు అల్లుకోవడం కోసం
వాళ్ళు ఏడురంగులతో ఎదురుచూస్తారు
దశాబ్దాలుగా కలిసి బతుకుతూ కూడా
అపరిచితుల్లా మిగిలిపోయే మన చీకట్లను వెక్కిరిస్తూ
ప్రేమ మాధ్యమాన్ని వెలిగించి చూపిస్తారు

0 comments:

టిక్..టిక్..టిక్..

ఈ వారం తెలుగు పదం

తెలుగు వెలుగులు