"ఇటు వైపెందుకూ??"
అచ్చం జేబుదొంగని పట్టుకున్నట్టే అడిగింది ఆవిడ
మొహం మళ్ళీ నల్ల బడింది.స్కూటరు ఎక్కిన దగ్గర్నించీ ప్రతి మలుపు దగ్గరా ఇటెందుకు? అటెండుకు ..అని ఆవిడ సతాయిస్తూనే వుంది.
"ఇటు వన్ వే ట్రాఫిక్కండీ..."
"అటు పెళ్ళి పందిరి వేశారు కదండీ...."
"ఆ వైపు కంకర వుంది..."
"అదిగో అక్కడ గోతులు తవ్వారు చూశారా..."
ఎప్పటికప్పుడు ఓపిగ్గా జవాబిస్తూ శీల పరీక్ష కి తట్టుకుంటున్నాను..అసలు దీనికంతటికీ కారణం మా సరళ. తనే తగిలించింది నాకు ఈవిడ్ని.జున్ను వండాను ,తిందువుగాని రా రా అంటే ఎరక్కపోయి వచ్చాను.ఈ మహాతల్లి బాధ్యత అప్పజెబుతుందని నాకేం తెలుసు?
"హమ్మయ్య వచ్చేశావా..సమయానికి దేవుడల్లే వచ్చావు. ఈవిడ చూడు పాపం , చుట్టాలింట్లో పెళ్ళికని వచ్చిందిట.మాతోటికోడలు పెద్దమ్మకి స్వయానా వేలు విడిచిన మేనత్త కూతురు..ఏమండీ , అంతేనా.. అడ్రస్సంతా కార్డులో వుందిట గాని కార్డు ఇంట్లోనే మర్చిపోయిందిట...మా ఇంటి ఫోను నంబరు వుండబట్టి ఫోను చేసింది., పొద్దున్న మీ బావ స్టేషనుకి వెళ్ళి తీసుకొచ్చాడు.సాయంత్రం దిల్ సుక్ నగర్ లో దింపుతాననే అన్నారనుకో , అయినా ఎందుకింక, నువ్వెలాగూ వచ్చావు కదా. ఓ పక్క వానొచ్చేలా వుంది. బాబ్బాబూ..మంచివాడివి కదా, కాస్త దింపేసి రారా..."
"ఇదిగో వకుళ గారూ, వీడు మా తమ్ముడు.ఇక్కడికి దగ్గర్లోనే హైదరగూడాలో వుంటాడు.. సినిమా బిజినెస్సు చేస్తున్నాడు. ఏరా అంతేనా..ఆ కంపెనీలోనే వున్నావా? మళ్ళి మారిపోయావా? అంటు నవ్వి, సరే పద పాపం ఆవిడ ఎదురుచూస్తోంది."తొందర పెట్ట్టింది.
సరళ ఎప్పుడు ఇంతే. సుడిగాలిలా చుట్టేస్తుంది.దిక్కు తోచనివ్వదు.ప్లేటులో జున్ను ముక్క నోటికి రుచించలేదు. ఓ పక్క అర్జెంటుగా నేను వాసవి ని కలవాలి.ఇవాళ ఆరు గంటలకల్లా మేము ఎప్పుడూ కూచునే ట్యాకు బండ మేద వుండమంది.
చూసి నెల్లాళ్ళయింది.పొద్దుట్నించీ తహ తహ లాడుతున్నాను. చిరు జల్లులో వాసవి నడుం చుట్టు చెయ్యెసి ట్యాంకు బండమీద కూచునే అదృష్టం లేకుండా అక్క ఈ పని లో ఇరికించింది.అసలిక్కడికి రాకుండా వుండాలల్సింది.హు..జున్నుకోసం ఎగబడి వచ్చేశాను.
"బావ వస్తాడేమో చూద్దాం సరళా..."అన్నాను ఏం చెయ్యలేక..
"అబ్బే రాడు, లేటవుతుందని పొద్దున్నే చెప్పాడు..."నవ్వుతూ అంది దుర్మార్గురాలు.తను మాత్రం బావతో హాయిగా ఇంట్లో కూచోదల్చుకుంది.
ఎటొచ్చీ నేనొకడ్ని దొరికాను కదా, పెళ్ళి పెటాకులు లేని ఒంటి పక్షిని. మీదు మిక్కి లి మగ వెధవని....చ చ..
ఆవిడ వంక చూశాను.ముప్పైకీ నలభై కి మధ్య ఎంతయినా వుండచ్చు వయసు, కొరకంచు లాంటి మొహమూ, చూపులో చిట్లింపూ ..అపరాధ పరిశోధనకి బాగా పనికొస్తుంది..పైగా నాతో కదలడానికి ఆవిడ ఏమంత తొందర పదుతున్నట్టు లేదు.సవాలక్ష సందేహాలు బైట పెట్టీంది.
"సొంత తమ్ముడేనా?" అండి మొదట,
తమల పాకులా మెరిసిపోతున్న అక్కకీ నాకూ పోలిక కట్టడం ఆవిడ వల్ల కావడం లేదు.
"సొంత అంటే సొంత కాదు లేండి.మా మేడమీద గదిలో వుండేవాడు. అయినా బంధుత్వానిదేముందండీ. మనసు మంచిదవ్వాలీ కానీ"- సరళ సంజాయిషీ చెప్పడం నాకేమీ నచ్చలేదు.
ఆ మాటకొస్తే ఆవిడకీ నచ్చినట్టు లేదు..అసలు బంధుత్వమే లేకుండా బంధాలేమిటీ వెర్రిగోల- అనుకుని వుంటుంది.
చేసేదేం లేక బండి స్టార్టు చేశాను.
హేట్ ఏట్ ది ఫస్టు సైట్ -లాగా తొలిచూపు నుంచీ నన్ను ఆవిడ ద్వేషించడం మొదలు పెట్టింది.అందులో నా తప్పు కూడా వుండచ్చు. ఇదిగో ఈ బవిరి గడ్డం గీక్కుని, జుట్టు బరుక్కుని, తెల్ల చొక్కా తొడిగితే కొంచె మర్యాదస్తుడిలా వుండేవాడ్నెమో గానీ, ప్రస్తుతం రాత్రంతా నిద్ర లేక ఎర్ర బడ్డ కళ్ళతో నలిగిపొయిన నల్ల చిక్కాతో అప్పుడే జైల్లోంచి పారిపోయి వచ్చినట్టుగా వున్నాను.
ఆవిడ చూస్తే వొంటినిండా నగల్తో వుంది. అంతకంటే ముఖ్యంగా ఆడమనిషై వుంది.ఆ రెందు భయాలు ఆవిడ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆడవాళ్ళు ఆడవాళ్ళుగా పుట్టినందుకే అంత నిస్సహాయులెందుకవుతారో నాకు అర్ధం కాదు.
" పేరేమిటి? కిరణా??"అడిగింది. కిరాతకుడా అన్నట్టు వినిపించింది.
ఔనన్నట్టు తలూపుదాం అనుకున్నా కాని నా తల అటు ముందుకు తిరిగి వుంది కదా అందుకని "ఊ"అన్నాను.
"ఏం చదివావు"
ఓ యబ్బో ....గంట ప్రయాణానికి నా బయోడేటా , కాండక్టు సర్టిఫికెట్టు మొత్తం పుచ్చుకునేలా వుంది. జవాబు దల్చుకోలేదు..
"ఏం పని చేస్తుంటావు సినిమా ఏజెంటా..?"అడిగింది.
"కాదు అది మానేశాను. ఇప్పుడు కాల్ సెంటరులో చేస్తున్నాను."అన్నాను ఓపిగ్గా..
"ఏమి సెంటరూ...అని రెట్టించి, నేనేదో చెప్పేలోపే మళ్ళీ అంది."ఓహో రాత్రిళ్ళు చేస్తుంటారే ఆ పనా..????"
నాకు నవ్వొచ్చింది. బలవంతాన ఆపుకుంటూ, "ఔనండీ , తెల్లవార్లూ చేసే పని..
ఆవిడకసలు నా మొహమే కాదు, ఉద్యోగం కూడా నచ్చలేదు.
అసలే మోసకారి పట్నంలో ,అంతకం టే మోసగాడిలా కనిపించే నాలాంటి కిరాతక, రాత్రి డ్యూటీ గాళ్ళతో ,వొంటెడు నగలు పెట్టుకున్న ఒక భద్ర మహిళ ప్రయాణం...వామ్మో .. ఎంత ప్రమాదం..
ఆవిడ నిస్సహాయత మొత్తం నాకు అర్ధమవుతూనే వుంది.ఆవిడ భయానికి తోడు వాన పట్టుకుంది.
అప్పట్నించీ మొదలు.. "అటెందుకు..ఇటు తీస్కళ్ళు... "
"ఇటెందుకు అటు సెంటరులోంచి తీస్కెళ్ళు.."
-ఆవిడకి వూరు కొత్తని అక్క చెప్పనే చెప్పింది.తెలిసినట్టు పోజులు ఎందుకు?
నిలువెల్లా అనుమానం కాకపోతే.. చిరాకెసింది.
ఆవిడ అనుమానంలాగే ఈ ముసురు ఒకటి. బురదలో ముందు చక్రం కూరుకుపొతోంది. ఇద్దరి మధ్యా ఆవిడ పెట్టీన సూట్కేసు ఏమిటో గానీ అందులోంచి ఒక గట్టి వస్తువేదో వీపుమీద చచ్చేట్టు గుచ్చుకుంటొంది.చోటు చాలకో ఏమో వెనక్కి జరిగిపోయి మాటిమాటికీ కదులుతుంటే అసలే ఇరుకు బండి బ్యాలన్సు తప్పుతోంది.
బ్యాగు వొళ్ళో పెట్టుకుని, దగ్గరికి జరిగి కూచుంటారా? అని అడగాలి.
జరీ చీర కొంగు కిందికి వేలాడుతోంది పైట కొంచెం జాగ్రత్త. అని చెప్పాలి.
తల్లీ నువు కొంచెం ఓపిక పట్టావంటే నేను జాగ్రత్తగా దింపేస్తాను.అని ధైర్యం నూరిపొయ్యాలి.
ఈ మాటలు బావున్నాయా? బూతు లేమైనా వున్నాయా..?అబ్బ ఆడవాళ్ళతో ఏం మాట్లాడితే ఏం మునుగుతుందో తెలీదు.ఆలోచిస్తూ బండి నడుపుతున్నాను. ఎదురు గాలికి చలేస్తోంది . వేడిగా కొంచెం టీ తాగాలనిపిస్తోంది.ఆ మాటే అడిగాను....
"వద్దు "అంది.
సరే మీరు రోడ్డు మీదే వుండం డి . నేను తాగి వస్తాను అనలేను..బూర్గుల భవనం దాటి వచ్చేసి హుస్సేను సాగరం చూస్తుంటే మనసు మూలిగింది..వాసవి వచ్చేసిందేమో..టైము తెలీడంలేదు.. వాచీలో అంకెలు కనిపించడం లేదు. వాన కళ్ళ మీద పడుతోంది.టొపీ మర్చిపోయి వచ్చాను.
"కిరణూ.." చప్పట్లు కొట్టి పిలిచీంది. పిలిచిన శాల్తీ వైపు నడిచాను.
అరె. వాసవి. చీర కట్టుకుంటే గుర్తు పట్తలేక పోయాను.ఎప్పడూ సల్వారు డ్రస్సులోనే చూశాను కదా..
"హెలో ..వసూ..వస్తాను..రూముకెళ్ళీపో..వానలో తడవకు.ఈ విడ్ని దింపేసి..."అరిచాను.వూహు..వినదు కదా,
"ఆవిడేవరు? "కళ్లతోనే అడిగింది అడిగింది వాసవి.
"ఏమో తెలీదు."
"అదేమిటి.."
" అదంతేలే..."
"సస్పెన్సులో పెట్టకు.చెప్పు ముందు.." బండి పట్టుకుని ఆపింది.
"అంత సీను లేదులే వూరుకో.." హ్యాండిలు మీదున్న వాసవి చేతిని పక్కకి తోస్తూ వారించాను. నా చెయ్యి గట్టిగా పట్టుకుంది వాసవి.
"దయచేసి నా మాట విను, గడ్డం పట్టుకుందామనుకున్నాను." వెనకాలే ఈ విడొకర్తి.
వాసవి మొండిది, నన్ను కొత్త వాళ్ళ ముందు ఇబ్బంది పెట్టడమంటే భలే సరదా..
"చిట పట చినుకులు పడుతూ వుంటే..."అంటూ, పాడుతూ కొన్ని నీళ్ళు నా మీద చిలకరించింది.
భయం భయంగా ఆవిడ వైపు చూశాను.ఆవిడ క్రూరాతి క్రూరంగా మా వంక చూస్తోంది.
"వాసూ ఒక్కసారి నా పరిస్థితి అర్ధమ చేసుకో.."అన్నాను
వాసవి ఇంక మాట్లాడలేదు.మొహం ముడుచుకుని తన బండి స్టార్టు చేసుకుని వెళ్ళీపోయింది.
అబ్బ..ఇద్దరు ఆడవాళ్ల మధ్యా నేను వెధవని అయిపోయాను.
"మేడమ్ మిమ్మల్ని ఆటో ఎక్కించనా? అదిగో ఆ అమ్మాయి నా దోస్తు తనతో నాకు పని వుంది."నా వెనక వున్న శాల్తీని అడిగాను.
"వద్దు."
వద్దు ట ,వద్దు- ఏమిటి వద్దు, అన్నీ ఈవిడ ఇష్టమేనా? అనుకున్నాను.
అప్పుడు మెల్లిగా ఏదో గొణుక్కుంది.
"ఏమిటి అంటున్నారు? నా గొంతు నాకు తెలీకుండానే కరుగ్గా మారింది.
"ఏమీ లేదు."అంది
"నాకు వినిపించింది."అన్నాను
......
తెలియని దేవత కంటే తెల్సిన భూతం మేలు అన్నారా ..లేదా.. నాకు చెముడు లేదు .అండుకని వినిపించీంది..
"కాదు అలా అన్లేదు." డబాయించింది.
ఆవిడతో వాదించి లాభం లేదు.నెత్తికి చుట్టుకున్నది నేనే కనక ఎలాగోలా ఇంటి దగ్గర దింపేస్తే ఒక పని అయిపోతుంది.ఒక పని ఏమి ఖర్మ. నా పని పూర్తిగా అయిపోతుంది. ఈ వానలో ఇప్పుడు వాసవి చచ్చినా తలుపు తియ్యదు.అసలే కోపంలో వుంది.స్టేషనుకి వెళ్ళి తీసుకు రాకపోగా తనే పిలిచి పలకరించినా కాదని వచ్చేశాను.
"అమ్మా మహాతల్లీ... ఇది చైతన్య పురి బస్టాపు.. ఇప్పుడు చెప్పండి ..మీ ఇల్లు ఎటు...?"
"ఆ.. ఔను...ఇక్కడ వంతెన ఏదో వుండాలి..."
"ఏ వంతెన?"
"వంతెన అంటే వంతెన కాదు.. అలాంటిదే.. అంటున్నాను."
ఆమూల నుంచి, ఈ మూల దాకా అంటె, సాయిబాబా గుడి దగ్గర్నింధీ, పండ్ల మార్కేట్టు దాకా ఓపిగ్గా తిప్పాను.ఇద్దరం తప్పగా తడిసిపోయాం.
"అన్నట్టు ఫంక్షను హాలు పేరేమిటన్నారూ?" అడిగాను.
"అదేనండీ పేరు గుర్తులేదు.. కానీ దానికి దగ్గర్లో వంతెన లాంటిది వుంటుందట..అక్కడిదాకా వెడితే తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు కనిపించక పోరు.."అంది.
.........................................
"ఇప్పుడు లైట్లు లేవు, చీకటి ఒక గోల, లేకపోతే గుర్తు పట్టేదాన్ని."
"అడ్రస్సు తెలేదనే విషయం ముందే చె ప్పచ్చు కదండీ" అన్నాను. నాకు నీరసం వచ్చేస్తోండి.
ఆవిడ యాతన నాకూ తెలుస్తోంది.
"పోనీ ఒక పని చేద్దాం.ఇంకొక అరగంట వెతికి మళ్ళీ మిమల్ని మా అక్కా వాళ్ళీంట్లో దింపేస్తాను.
రేపు తెల్లారాక కూడా వ్రతాలు ఏవో వుంటాయి కదా , మా బావతో కలిసి పగలు వద్దురు గాని, సరేనా" అన్నాను.
"మరి మీ అక్క పుట్టింటి బడేక్కేస్తుందేమో ఈ పాటికి " అంది.
"అదేమిటి , నాకు చెప్పలేదే.." అన్నాను ఆశ్చర్యంగా..
"ఔనట. నాకు చెప్పింది.వాళ్ళ పెద్దన్న అమెరికా నుంచి వస్తున్నాడని అన్నది నాతో, ఎలాగోలా మీ బావతో ప్రయాణం కట్టీంచాలని తన ప్లాను."
"మరి ఇప్పుడేమిటి దారి...?..పోనీ నా రూం కొచ్చి ఈ పూటకి" అనబోయి ఆవిడెలా అర్ధం చేసుకుంటుందో తెలీక మానేశాను.
ఉన్నపళాన కదలనని బండి మొరాయించింది.
"చూడండి మిస్..(తన పేరేమిటో నాకింకా తెలీదని అప్ప్పుడు గుర్తొచ్చింది.)ఇప్పుడు బండి కూడా కదలడం లేదు.ఇక్కడెక్కడైనా హోటల్లో మిమ్మల్ని దింపి....అలా భయపడక్కర్లెదు. నేను రేపు పొద్దున్నీ వచ్చి తీసుకెడతాను..."
ఆవిడ ఏమీ అన్లేదు.నిస్సహాయంగా చూసింది.
నేను మౌనంగా నుంచుండి పోయాను.బండి తోసుకుంటూ నేనూ , నా వెనకే ఆవిడా ఒక పచారి దుకాణం ముందున్న షెడ్డు కింద చేరాం.
దుకాణం మూసెసి వుంది.
" రోడ్డుకి అవతల ఎక్కడినా చిన్న టీ బడ్డీ వుందేమో చూస్తాను.వేడిగా ఏమయినా తాగుదామండీ కొంచెం బుర్ర పనిచేస్తుంది.ఇందాకా అక్క ఇచ్చినా కూడా మిమ్మల్ని తీసుకువచ్చే తొందరలో మర్చిపోయాను"
"ఇల్లు దొరకనివ్వండి. భోజనం కూడా పేట్టిస్తాను." అంది ఆపద మొక్కుల వాడ్ని ప్రార్ధించి,
నాకు కూడా భజన చెయ్యడం మినహా ఇంక దిక్కులేదు.దేవుడు ఆవిడ మొర ఆలకించి నట్టున్నాడు.
"ఏమిటి వదినా ఇక్కడున్నావూ?"ఒక ఇరవై యేళ్ల కుర్రాడు లోపలి సందులోంచి వస్తూ గొడుగులోంచి అరిచాడు.
"ఓరేయి ఆగు ....అరిచినట్టు ఏడిచీందో.. ఏడిచినట్టు అరిచిందో గాని -వాడు ఆగాడు.
"ఎక్కడ్రా పెళ్ళి, వూరుకాని వూళ్ళో ఒక్కదాన్నీ వెతుక్కుని, వెతుక్కుని నానా యాతనా పడుతున్నా..."అంటూ వెనక్కి తిరిగి, ,వెడతానండీ అని కళ్లతోనే చెప్పి, వాడి తో నడుచుకుంటూ వెళ్ళీపోతోంది.
నడవని బండిని ఈడ్చుకుంటూ...చలిలొ, ఆకలిలో ...ఒక్కడ్నీ నేను.....
ఎవరికోసం ఇంత కష్టపడ్డానో ఆవిడ నోటి వెంట ఒక్క మంచిమాట లేదు.ఆ సతాయింపేమిటో , అనుమానమేమిటో...ఏమిటో ఈ ఆడవాళ్ళు ఎప్పుడు మారతారో తెలీదు.
వెనక్కి కూడా చూడకుండా ఎలా పోతోదో చూడు.అక్కడ వాసు కూడా ఆడదే కదా. పైగా నేను బండి మీద పరాయి ఆడదానితో కనిపించానయ్యే...అంచేత ఇంక రానివ్వదు.కక్ష తీర్చుకుంటుంది.అందులోనూ ఇప్పుడు వాన కదా, మగాడ్ని కదా,పక్కింటి వాళ్ళూ, ఎదురింటి వాళ్ళూ , వెనకింటి వాళ్ళూ ఎమైనా అనుకుంటారు కదా...
రాత్రంతా వానలో స్నేహితుడు బురద కొట్టుకు పోయినా సరే..పిడుగులు పడి చచ్చినా సరే.. తెల్లారి పలకరిస్తుందేమో.., తీరిగ్గా..మర్యాదగా..ఎవరూ ఏమీ అనుకోకుండా....
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
4 months ago
0 comments:
Post a Comment